హిందూ క్యాలెండర్, పంచాంగం
భారత ప్రజల కాల గణన
క్యాలెండర్ అనేది సమయాన్ని లెక్కించడానికి, రుతువులను ట్రాక్ చేయడానికి మరియు పండగలను నిర్వహించడానికి ఇంకా పుట్టినరోజు, వివాహ దినోత్సవం మొదలైన రోజువారీ జీవితంలో ముఖ్యమైన తేదీలను జరుపుకోవడానికి ఉపయోగిస్తారు.
ఇండియన్ క్యాలెండర్ అనేది చంద్ర మరియు సౌర చలనం ఆధారంగా రూపొందించబడింది. ఈ క్యాలెండర్ ను భారత ఉపఖండం, కంబోడియా, మలేషియా, లావోస్ మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు.
శకం లేదా క్యాలెండర్ ప్రారంభం
ప్రతి క్యాలెండర్ కు నిర్దిష్టమైన ఒక రిఫరెన్స్ సంవత్సరం ఉంటుంది, సమయం లెక్కించడానికి. క్రిస్టియన్ లేదా కాథలిక్ చర్చి అధ్యక్షుడైన పోప్ గ్రెగరీ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత సంవత్సరం 2020. ఈ 2020 యేసుక్రీస్తు తరువాత 2020 సంవత్సరాలు గడిచిపోయాయని సూచిస్తుంది. ఇస్లామిక్ కేలండర్ లో మొదటి సంవత్సరం మహమ్మద్ ప్రవక్త (622) తో మొదలై ప్రస్తుత సంవత్సరం వారికి 1442 కింద నడుస్తుంది. అదేవిధంగా ఒక గొప్ప సంఘటన నుంచి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో లెక్కించడం కొరకు మనకు 3 రిఫరెన్స్ పాయింట్లు ఉన్నాయి.
- శక సంవత్సరం లేదా శక శకం
- శక శకం శాలివాహన రాజ్యం భారత్ లో పరిపాలన ప్రారంభించిన నాటి నుండి మొదలైంది. ఇది క్రైస్తవ కాలండర్ క్రీ.శ. 78 వ సంవత్సరం నుండి ప్రారంభమైంది. నేడు 1942 సంవత్సరం. ఇది భారత ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ సంవత్సరం కూడా.
- విక్రమ శకం
- ఈ శకం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు భారత్ లో పరిపాలన ప్రారంభించిన నాటి నుండి మొదలైంది. ఇది క్రీ.పూ 57 న ప్రారంభమైంది అంటే ప్రస్తుత సంవత్సరం ప్రకారం 2077.
- కలియుగ ప్రారంభ శకం
- ఈ శకం శ్రీకృష్ణుడు భూలోకాన్ని వదిలి వైకుంఠం వెళ్ళిన తరువాత కలియుగం ప్రారంభం అయినట్టు సూచిస్తుంది. ఈ శక ప్రకారం ప్రస్తుత సంవత్సరం 5122. దీని ద్వారా మన భారతం జరిగి 5 వేల సంవత్సరాలు అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
రాశులు, నక్షత్రాలు, విశ్వం
మనం భూమి నుండి మన చుట్టూ ఉన్న అనంత విశ్వాన్ని ఆకాశంలోకి చూస్తే మనకు గ్రహాలు నక్షత్రాలు కనిపిస్తాయు. మన భూమిని కేంద్రంగా చేసుకొని ఈ విశ్వాన్ని మన చుట్టూ 360 డిగ్రీల వృత్తంగా గీసుకోవచ్చు. ఈ వృత్తాన్ని 12 ముక్కలు(slices) చేస్తే మనకి 12 రాశులు వస్తాయి, ఓక్కో రాశి 30 డిగ్రీలు వస్తుంది, అలానే 27 ముక్కలు చేస్తే 13.33 డిగ్రీల pie లేదా ఒక నక్షత్రం వస్తుంది.
మొదటి 30 డిగ్రీలని మేషరాశి అని, 60 ని వృషభం, 150 ని సింహం, 270 డిగ్రీలని ధనస్సు అని పేర్లు పెట్టారు. అలానే మొదట 13.33 డిగ్రీలకి అశ్విని అని, 26.66 కి భరణి, 133.3 కి మఖ, 266.6 కి పూర్వఆషాడ అని పేర్లు పెట్టారు.
ఈ రాశులని, నక్షత్రాలని ఈ క్రింద చిత్రంలో చూడండి. వాటి డిగ్రీలని జాగ్రత్తగా గమనించండి. మధ్య కేంద్రకంలో భూమి, దాని మీద మనం ఉన్నాం. మన క్యాలెండర్ దీని మీదే నిర్మించబడింది.
సంవత్సర నామం
హిందూ క్యాలెండర్ లో మనకు 60 సంవత్సర నామములు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరం శ్రీ శార్వరి నామ సంవత్సరం. గురు గ్రహం భూమి చుట్టూ ఒక వృత్తాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు తీసుకుంటే, శనికి 30 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండు గ్రహాలు సున్నా డిగ్రీల దగ్గర ప్రయాణం ప్రారంభిస్తే, మరలా అదే పాయింట్‌లో 60 (LCM of 30 & 12) సంవత్సరాల తర్వాత కలుస్తాయి. ఒక్కో సంవత్సరానికి ఒక పేరు పెట్టారు.
నెల లేదా మాసం
హిందూ క్యాలెండర్ మాసంలో చంద్ర గమన ఆధారంగా రోజులు ఉంటాయి. చంద్రుడు భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేయడానికి 29.5 రోజులు తీసుకుంటాడు. అదే కాలంలో సూర్యుడు 30 డిగ్రీలు లేదా ఒక రాశి (360/12= 30) దూరం ప్రయాణిస్తాడు. చంద్ర గమనంలో 2 పక్షాలు వస్తాయి. పక్షం అనగా 15 రోజులు, ఒక పక్షంలో ప్రకాశవంతమైన చంద్రుడు పెరిగి, పెరిగి పెద్దగా అయి పౌర్ణమి చంద్రుడుగా మారతాడు, దీనిని శుక్లపక్షం అని అంటారు. ఇంకొక పక్షంలో చంద్రుడు దిన దినాన క్షీనిస్తా చీకటివైపు ప్రయాణించి అమావాస్యకి అదృశ్యం అవుతాడు. దానినే మనం కృష్ణపక్షం అంటాం. చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెలకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. ఈ నెల కృతికా నక్షత్రం పేరుమీద కార్తీక మాసం.
మన నెలలు
Sl.No. |
Lunar Month |
Solar Month |
Greogorian Month |
1 |
Chaitra |
Mina |
March |
2 |
Vaisakha |
Mesha |
April |
3 |
Jyesta |
Vrishba |
May |
4 |
Ashada |
Mithuna |
June |
5 |
Shravana |
Karka |
July |
6 |
Bhadra |
Singha |
August |
7 |
Ashwina |
Kanya |
September |
8 |
Karthika |
Tula |
October |
9 |
Margashira/Agrahayana |
Vrishchika |
November |
10 |
Pushya |
Dhanus |
December |
11 |
Magha |
Makara |
January |
12 |
Phalguna |
Kumbha |
February |
చంద్ర మరియు సౌర మాసాల మధ్య దిద్దుబాటు
సూర్యుడుకి ఒక సంవత్సరం లేదా భూమి చుట్టూ ఒక వృత్తాన్ని పూర్తి చేయడానికి 365 రోజులు పడుతుంది, చంద్రుడుకి ఒక సంవత్సరం పూర్తి చేయడానికి 354 రోజులు (29.5 * 12 నెలలు) పడుతుంది. కాబట్టి సూర్యచంద్రుల మధ్య సంవత్సరంలో 11 రోజుల వ్యత్యాసం వస్తుంది. చంద్ర మరియు సౌర కదలికల మధ్య ఈ తేడాను సరిచేయడానికి, ప్రతి 32.5 నెలల తరువాత ఒక అదనపు నెలని లేదా అధికమాసాన్ని ఈ 2 గ్రహాలను సమకాలీకరించడానికి క్యాలెండర్ లో చొప్పించబడుతుంది, తద్వారా ఋతువులు నెల పేర్లతో సమలేఖనం చేయబడతాయి. ఉదా: చలికాలం ఎప్పుడూ కార్తీక మాసంలోనే వస్తుంది. ఈ అధికమాసం ఏ నెలలో వస్తే ఆ నెల పేరే పెడతారు. ఈ సంవత్సరం 2020 లో మనకు అధిక అశ్వయుజ మాసం వచ్చింది.
రోజు లేదా పంచాంగం
మన రోజు కొలత ప్రధానంగా చంద్ర గమనం పై ఆధారపడి ఉంటుంది, అయితే చంద్రుని గమనాన్ని సూర్యుని కి అనుసంధిస్తారు. అందుకే మన క్యాలెండర్ ని లూనీ-సోలార్ క్యాలెండర్ అని అంటారు.
మన పూర్వీకులు ఒక రోజును 5 అంగాలుగా లేదా భాగాలుగా విభజించారు. ఈ పంచ-అంగాలనే మనం పంచాంగము అని పిలుచుకుంటున్నాం
- తిథి
- మనకు 30 తిధులు ఉన్నాయి. ఈ 30 తిథులు కృష్ణపక్షానికి 15 మరియు శుక్లపక్షానికి 15 గా విభజించబడ్డాయి. శాస్త్రీయంగా ఒక తిథి అంటే సూర్యుడు మరియు చంద్రుని మధ్య 12 డిగ్రీల కోణీయ భేదం. సున్నా డిగ్రీలు అమావాస్య, 12 డిగ్రీలు పాడ్యమి, 60 డిగ్రీలు పంచమి, 90 అష్టమి, 180 డిగ్రీలు పూర్ణిమ, 270 కృష్ణపక్ష అష్టమి, 360 లేదా మరలా సున్న అమావాస్య.
- వారం
- మనకు నవ గ్రహాలు ఉన్నాయి. ఆ తొమ్మిది గ్రహాలలో రాహు కేతువులు ఛాయా గ్రహాలు లేదా నీడ గ్రహాలు కాబట్టి వారికి ఒక రోజు లభించలేదు, మిగిలిన 7 నిజ గ్రహాలకి 7 రోజులు కేటాయించగ మనకి ఒక వారం తయారయుంది. సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని పేర్ల మీద మనకి వారాలు వచ్చాయి.
- నక్షత్రం
- చంద్రుడు భూమి చుట్టూ ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి 27.33 రోజులు పడుతుంది. ఈ 27 రోజులుని 27 నక్షత్రాలుగా విభజించారు. చంద్రుడు ఒక నక్షత్రంలో సరిగ్గా ఒక రోజు ఉంటాడు లేదా గడుపుతాడు. శాస్త్రీయంగా ఒక నక్షత్రం అంటే ఖచ్చితంగా 13.33 డిగ్రీలు. 360 డిగ్రీల వృత్తాన్ని 27 రోజులలో పూర్తి చేస్తే 360/27=13.33 వస్తుంది. నక్షత్రాలని, రాశులని లింక్ చేయటానికి నక్షత్రాలని పాదాలుగ విభజించారు. మొత్తం 108 పాదాలు (LCM 12,27 = 108). ఒక నక్షత్ర పాదం = 3.33 డిగ్రీలు, ఒక రాశి = 9 నక్షత్ర పాదాలు లేదా 2.25 నక్షత్రాలు.
- యోగం
- ఒక నెలకు యోగాలను 27 భాగాలుగా విభజించి రోజుకు ఒక యోగం ఇచ్చారు. ఆ రోజు యోగం పొందడానికి సూర్యునికి చంద్రునికి మధ్య ఉన్న కోణ వ్యత్యాసంను జోడించి, దానికి 360 డిగ్రీలు కలిపి 13 డిగ్రీల 20 నిమిషాల తో భాగిస్తే వస్తుంది.
- కరణం
- కరణం సరిగ్గా తిథిలో సగం, అంటే సూర్యుడు మరియు చంద్రుడు మధ్య 6 డిగ్రీల కోణీయ దూరం. మనకు 30 తిధులు ఉన్నాయి కాబట్టి మనకు మొత్తం 60 కరణాలు వచ్చాయి. ఈ 60 కరణాలని 4 స్థిర కరణాలు మరియు 7 భ్రమణ కరణాలతో సాధించబడింది, 7*8 = 56 + 4 = 60 కరణాలు.
- స్థిర కరణాలు చతుర్ధసి తిథిలో రెండవ భాగంలో మొదటిది, అమావాస్య తిథి మొదటి భాగంలో రెండవది, రెండవ భాగంలో మూడవది, పాడ్యమిలో మొదట భాగంలో నాలుగో కరణం వచ్చిన తరువాత, వరుసగా భ్రమణ కరణాలు ఒక దాని తరువాత మరొకటి వస్తాయి.
పంచాంగం లో చెప్పటానికి మనకి మరిన్ని సాంకేతిక విషయాలు ఉన్నాయి కానీ ఈ ప్రాథమికాంశాలతో ఇక్కడ ముగిద్దాం. మన కేలండర్ పూర్తిగా మన చుట్టూ ఉన్న ఖగోళ సంఘటనల ఆధారంగా, పూర్తిగా శాస్త్రీయంగా, గ్రహ వేగం, స్థానాల ఆధారంగా నిర్మించబడింది. జ్యోతిష్యశాస్త్రం అనేది ఖగోళ శాస్త్రం మరియు హిందూ క్యాలెండర్ పైన నిర్మించిన మరొక శాస్త్రం.
సమాప్తం
సమయం సాపేక్షికమైనది. ఇది గ్రహం యొక్క భ్రమణంపై ఆధారపడి ఉంటుంది. మన కాలం భూమి భ్రమణ వేగం ఆధారంగా నిర్మించబడింది.
Comments
Post a Comment